పోలీస్ స్టేషన్ అంటే భయం కాదు.. భరోసా కల్పించిన అధికారి! ఎస్సై బాలరాజుపై ప్రశంసల జల్లు
27 నెలల పాటు రామాయంపేట ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీస్ శాఖపై నమ్మకం పెంచిన ఎస్సై బాలరాజు – ప్రశంసించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం.

పోలీస్ స్టేషన్ అంటే భయం కాదు.. భరోసా కల్పించిన అధికారి! ఎస్సై బాలరాజుపై ప్రశంసల జల్లు
27 నెలల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రత్యేక గుర్తింపు.. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంచిన బాలరాజు: ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం
రామాయంపేట,
పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితిని మార్చి.. ప్రజలు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకునేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిన అధికారి ఎస్సై బాలరాజు అని రామాయంపేట ప్రెస్ క్లబ్ (టి యు డబ్ల్యూ జే) అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం అన్నారు. రామాయంపేట పోలీస్ స్టేషన్లో 27 నెలల పాటు ఎస్సైగా విధులు నిర్వహిస్తూ తనదైన పని తీరుతో ప్రజలకు చేరువయ్యారని ఆయన కొనియాడారు.
గతంలో ఏదైనా సమస్య ఎదురైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలా? పోలీసులకు చెబితే ఎలా స్పందిస్తారు? అనే సందేహాలు, భయాలు కొంతమందిలో ఉండేవని మల్లేశం గుర్తుచేశారు. అయితే ఎస్సై బాలరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని, ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెప్పుకునేలా నమ్మకమైన వాతావరణం ఏర్పడిందని తెలిపారు.
చిన్న సమస్యకైనా స్పందన.. ప్రజలకు భరోసా!
చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనమని మల్లేశం పేర్కొన్నారు. పోలీసులు అంటే కేవలం నేరాలను అరికట్టడం, కేసులు నమోదు చేయడం మాత్రమే కాదని.. ప్రజలకు భరోసా కల్పించడం, బాధితులకు అండగా నిలవడం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే దిశగా కృషి చేయడం కూడా ముఖ్యమని అన్నారు
ఈ విషయంలో ఎస్సై బాలరాజు ప్రజలతో మమేకమవుతూ, అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించారని ప్రశంసించారు. ప్రజలు పోలీస్ స్టేషన్‌ను తమ సమస్యలు చెప్పుకునే వేదికగా భావించేలా చేయడం, పోలీసుల పట్ల ఉన్న భయాన్ని తగ్గించి నమ్మకాన్ని పెంపొందించడం అభినందనీయమన్నారు.
27 నెలల సేవలు మరువలేనివి..
అధికారులకు బదిలీలు సహజమే అయినప్పటికీ, ప్రజలకు చేరువై సేవలందించిన ఇలాంటి అధికారి బదిలీపై వెళ్లడం బాధాకరమని బసన్నపల్లి మల్లేశం అన్నారు. రామాయంపేటలో 27 నెలల పాటు బాలరాజు అందించిన సేవలు ప్రజలకు గుర్తుండిపోతాయని, విధి నిర్వహణలో ఆయన చూపిన చొరవ, ప్రజలతో కొనసాగించిన సత్సంబంధాలు మరువలేనివని పేర్కొన్నారు.
ప్రజలకు పోలీస్ శాఖపై మరింత విశ్వాసం కలిగించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కొనసాగించాలని, బాలరాజు వంటి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షుడు పాతూరి రమేష్ గౌడ్, రామాయంపేట ప్రెస్ క్లబ్ (టి యు డబ్ల్యూ జే) ఉపాధ్యక్షులు తుజాల శ్రీనివాస గౌడ్, కర్రె నరేందర్, కోశాధికారి రంగా రాజకిషన్, సభ్యులు బల్ల యాదగిరి, తుడుం పెంటయ్య, సార్గు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
