కల్లు తాగితే చెప్పుదెబ్బలు.. రూ.5 వేల జరిమానా! దండుపల్లిలో గ్రామస్తుల సంచలన హెచ్చరిక!
రూ.15 నుంచి రూ.20కు పెరిగిన కల్లు ధర.. ఫ్లెక్సీలతో వినూత్న నిరసన తెలిపిన గ్రామస్తులు!

మెదక్ జిల్లా: కల్లు ధరల పెంపుపై గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో కల్లు ధరను పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
గతంలో కల్లు సీసా ధర రూ.15 ఉండగా, ఇటీవల రూ.20కి పెంచడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై గ్రామంలో కల్లు తాగితే ఐదు చెప్పుదెబ్బలు, రూ.5 వేల జరిమానా విధిస్తామని ఫ్లెక్సీల ద్వారా హెచ్చరించారు.
కల్లు ధరల పెంపునకు వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన ఈ వినూత్న నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మరి గ్రామస్తుల ఈ నిరసనపై సంబంధిత అధికారులు, కల్లు దుకాణ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.



